నటుడవ్వాలని వచ్చి, దర్శకుడు అవటం, దర్శకుడు అవ్వాలి అని వచ్చి నటులయిన వారు ఎందరో! ఇలా అవ్వాలనుకున్నది ఒకటయితే, అయ్యింది ఇంకొకటి అన్నట్లు సినీ జీవితాలు ప్రారంభించిన వారు ఎందరో! ఉదాహరణకు నటుడు అవ్వాలని వచ్చిన కిషోర్ కుమార్, గాయకుడిగా ప్రసిద్ధులు అయ్యారు, హిందీ చిత్ర పరిశ్రమను మూడు దశాబ్దాలు ఏలారు. అలాగే మన తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు అవ్వాలనుకొని వచ్చి సంగీత దర్శకుడు అయిన వారు చక్రవర్తి గారు. పేరు కు తగినట్లుగానే మూడు దశాబ్దాలు సంగీత చక్రవర్తిగా వెలుగొందరు, దాదాపు 960 చిత్రాలకు సంగీతం అందించి రికార్డు క్రియేట్ చేసారు. చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పా రావు, మొదట గాయకుడిగా రంగ ప్రవేశం చేసారు , “మాంగల్య యోగం” అనే కన్నడ చిత్రం లో మొదటి సారిగా ఒక పాట పాడారు, అప్పుడు ఆయన అప్పాజీ అని టైటిల్ కార్డు వేయించుకున్నారు. గాయకుడిగా కంటిన్యూ చేయటం ఇష్టం లేని అప్పా రావు, డైరెక్టర్ సి.ఎస్.రావు దగ్గర అసిస్టెంట్ గ చేరిపోయారు.
ఆ తరువాత డబ్బింగ్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తారు, తమిళ్ చిత్రాలు డబ్ చేయాలంటే అప్పా రావు గొంతు ఉండవలసిందే. చిన్న తనం లో నేర్చుకున్న సంగీత జ్ఞానం తో సెట్స్ లో ఉన్నప్పుడు కూని రాగాలు తీస్తుండే వారు అప్పారావు, అది వినిన సమతా మూవీస్ ఛటర్జీ గారు, ఏదో ఒక రోజు తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని ఏలుతావయ్యా అనే వారట, ఆయన నోటి చలువో, ఏమో తెలుగు సంగతానికి చక్రవర్తి అయ్యారు అప్పా రావు. ఛటర్జీ గారే అప్పా రావు పేరును చక్రవర్తి గ మార్చి 1971 లో “మూగ ప్రేమ” అనే చిత్రం తో సంగీత దర్శకుడిని చేసారు. ఆ తరువాత మూడు దశబ్దాలు అయన సంగీత ప్రయాణం అప్రతిహతంగా సాగిపోయింది, సంగీత దర్శకుడిగా అయన 1000 ,చిత్రాలు పూర్తి చేయాలి అనుకున్నారు కానీ ఆయన ప్రయాణం 960 చిత్రాల దగ్గరే ఆగిపోయింది, అదొక్కటే వెలితి అయన జీవితంలో. నటుడు అవ్వాలి అనుకున్న ఆయన కొన్ని చిత్రాలలో నటించి ఆ కోరిక కూడా తీర్చుకున్నారు. సంగీత దర్శకుడిగా, నటుడిగా, గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గ బహుముఖ సేవలు అందించి చిరస్మరణీయుడు అయ్యారు చక్రవర్తి గారు..!!