ఒక్క సారి ముఖానికి రంగు వేసుకొంటే ఇక జీవితాంతం ఆ పిచ్చి వదలదు అనేది సత్యం, మొదట్లో ఒక్క ఛాన్స్ వస్తే చాలు నేనేంటో చూపిస్తాను అనుకుంటారు, ఛాన్స్ వచ్చి నిరూపించుకున్నాక, ఇక జీవితాంతం నటుడిగానే కొనసాగాలనుకుంటరు చాలా మంది, నటుడిగా వారు పొందే పాపులారిటీ అటువంటిది, ఆ పేరు ప్రతిష్టలు శాశ్వతంగా పొందాలనుకుంటారు. కాలానుగుణంగా హీరోలు – విలన్లు, క్యారెక్టర్ యాక్టర్ లుగా మారుతారు కానీ వెండి తెరను మాత్రం వదలరు, వీరు కొంత వరకు మేలు, వాస్తవాలను అంగికరించి, మారారు అనుకోవచ్చు. కొంత మంది మాత్రం ఆరు పదుల వయసులోనూ మేము హీరోలమే అంటూ తెర మీద గెంతులు వేస్తూ అవస్థలు పడుతుంటారు, మేము మారితే మా ఫాన్స్ ఒప్పుకోరు అని నొక్కి వక్కాణిస్తుంటారు. ఎవరో కొందరు మాత్రమే అరుదుగా తమ పాపులారిటీ, ఫేమ్ మంచిగా ఉన్నపుడే నటనకు దూరం జరిగి తమ ఇమేజ్ ను కాపాడుకుంటారు ఆ కోవకు చెందిన వారు మనకు తెలిసిన శోభన్ బాబు గారు..
కానీ అంత కంటే ముందు మొదటి తరం హీరోలలో ఒకరు మంచి ఫేమ్ లో ఉన్నపుడే నటనకు దూరం అయ్యారు. 1951 లో హీరో గ వెండి తెర ప్రవేశం చేసిన మంత్రవాది శ్రీరామ మూర్తి, చూడగానే యెన్.టి.రామ రావు లాగానే ఉన్నాడే అన్నట్లు ఉండే వారు మంత్రవాది. రెండు చిత్రాలు నటించిన అవి అట్టర్ ప్లాప్ అయ్యాయి, శ్రీరామ మూర్తి మంచి చిత్రకారుడు అవటం వలన చిత్రలేఖనం తో కాలం గడిపారు, ఆ తరువాత కొంత కాలానికి జ్యోతి, పెంపుడు కొడుకు,పేద రైతు వంటి చిత్రాలలో నటించారు మంచి పేరు వచ్చింది, అవకాశాలు రావటం మొదలు అవుతున్న సందర్భం లో ఆయన నటనకు స్వస్తి చెప్పి సినీ రంగం నుంచి నిష్క్రమించారు. గుంటూరు లో మెహెర్ ఫోటో స్టూడియో ను స్థాపించి పూర్తి గ దానికే అంకితం అయ్యారు, వివాహం , పిల్లలు అంటూ చాల సాధారణం అయిన జీవితం గడిపి తన తొంభయ్యవ ఏటా 2011 లో ఒక కారు ప్రమాదం లో మరణించారు. పేరు, డబ్బు, వస్తున్న సందర్భం లోనే వాటిని తృణప్రాయం గ భావించి వదలి వెళ్లే సాహసం అందరు చేయలేరు, ఎవరో కొందరు స్థితప్రజ్ఞులు మాత్రమే చేయకలిగిన సాహసం అది..!!