
ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ సినిమాతో మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఈ చిత్రంలో తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదనే అభిప్రాయం ఉందని, తాను కూడా మొదట అలాగే అనుకున్నానని ఆమె తెలిపారు.
“ది రాజా సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాను. స్టార్ హీరో సినిమాలో అవకాశం అనగానే, రెండు పాటలు, నాలుగైదు సన్నివేశాలకే పరిమితం అనుకున్నాను. కానీ ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. ఈ సినిమాలో నాకు మంచి ప్రాధాన్యమున్న పాత్ర లభించింది. ఒక కథానాయికకు, అది కూడా తొలి తెలుగు సినిమాలోనే ఇంత మంచి పాత్ర దొరకడం నిజంగా గొప్ప విషయం” అని మాళవిక వివరించారు..!!
