
జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందిన కీర్తి సురేశ్ తన కెరీర్లో మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతున్నారు. నటిగా ఉన్నత స్థాయిలో రాణిస్తున్న ఆమె, ఇప్పుడు దర్శకత్వం వైపు దృష్టి సారించారు. తాను సొంతంగా ఓ స్క్రిప్ట్ రాస్తున్నట్లు తాజాగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘రివాల్వర్ రీటా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.
పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ నెమ్మదిస్తుందనే అభిప్రాయాన్ని కీర్తి సురేశ్ పూర్తిగా మార్చేశారు. వివాహం తర్వాత కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాను మహానటిగా వెండితెరపై ఆవిష్కరించిన సావిత్రి కూడా దర్శకురాలు కావడం, ఇప్పుడు కీర్తి కూడా అదే బాటలో పయనించాలని అనుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నటిస్తూనే దర్శకత్వం చేయడం అంత సులభం కాకపోయినా, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు..!!

