
ప్రముఖ కథానాయిక కీర్తి సురేశ్ తన పేరుతో ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న AI మార్ఫింగ్ చిత్రాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డీప్‌ఫేక్ టెక్నాలజీతో సృష్టించిన ఈ నకిలీ ఫొటోలు తనను మానసికంగా ఎంతగానో బాధిస్తున్నాయని, విసుగు పుట్టిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా వాపోయారు. ఈ నకిలీ చిత్రాలు ఎంత సహజంగా ఉన్నాయంటే, వాటిని చూసినప్పుడు నిజంగానే తను అలా ఫోజు ఇచ్చానా? అని తనను తానే ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చిందని కీర్తి తెలిపారు.
AI సాంకేతికత ఎంత ప్రమాదకరంగా మారుతోందో చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఈ టెక్నాలజీ సామర్థ్యాలను నియంత్రించడం కష్టంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఇతరుల చిత్రాలను ఇలా దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కీర్తి సురేశ్ అభిప్రాయపడ్డారు..!!
