
నేషనల్ క్రష్’ రష్మిక మందన్న తనకు కొరియన్ డ్రామాలంటే (కే-డ్రామా) ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పారు. అయితే వాటిలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, కానీ ఆ ప్రాజెక్ట్ తనకు పూర్తిగా నచ్చాలని స్పష్టం చేశారు. విభిన్నమైన పాత్రలతో దూసుకుపోతున్న రష్మిక, తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“కే-డ్రామాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. అది చాలా సరదాగా ఉంటుంది. అయితే, వాళ్లు ఎలాంటి కథతో వస్తారన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తెరపై కనిపించే పాత్రల విషయంలో నేను చాలా పికీగా (జాగ్రత్తగా) ఉంటానని మీకు తెలుసు కదా” అని రష్మిక తెలిపారు. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలోనే తనకు కే-డ్రామాలపై ఆసక్తి పెరిగిందని, ఒక్కో సిరీస్‌లో 16 ఎపిసోడ్లు ఉండటంతో వాటిని చూసేందుకు చాలా సమయం దొరికిందని ఆమె గుర్తుచేసుకున్నారు.!!
