జీవితం పరీక్షలు పెట్టి, పాఠాలు చెపుతుంది , గుణపాఠాలు నేర్పిస్తుంది, ఆ పరీక్షలకు తట్టుకొని, పాఠాలను అర్ధం చేసుకొని, గుణపాఠాలు నేర్చుకున్నవాడే జీవితం లో ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడు, దానికి నిలువెత్తు నిదర్శనం రజనీకాంత్ జీవితం. దిగువ మధ్య తరగతి జీవితం, ఆకలి, పేదరికం, చదువుకోలేక పోవటం, బ్రతకడానికి దొరికిన అవకాశాలను ఉపయోగించుకొంటూ చివరికి బస్సు కండక్టర్ గ జీవితం ప్రారంభించి, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గ ఎదిగిన రంజనీకాంత్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఒకానొక సందర్భం లో ఈ కష్టాలు, కన్నీళ్లు, నిరాశ, నిస్పృహ లతో విసిగిపోయిన రజనీకాంత్ ఆత్మ హత్య చేసుకోవాలని నిర్ణయించుకొని , రాఘవేంద్ర స్వామి స్ఫూర్తి తో ఆ ప్రయత్నం విరమించుకొని మళ్ళీ పోరాడి విజయం సాధించిన యోధుడు రజనీకాంత్. బస్సు కండక్టర్ గ జీవితం సాగిస్తున్న రోజుల్లో తోటి కార్మికుడు, స్నేహితుడు అయిన రాజ్ బహదూర్ ఇచ్చిన గోల్డ్ చైన్ అమ్మి వచ్చిన డబ్బులతో మద్రాస్ చేరిన రజనీకాంత్, మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరి నటుడిగా శిక్షణ పొందిన తరువాత కుడా అవకాశాలు లేక , తిరిగి బెంగళూరు చేరుకున్నాడు…
జీవితం మీద విరక్తి తో ఆత్మ హత్య చేసుకోవాలని నిర్ణయించుకొని, విషం బాటిల్ కొని, జేబులో పెట్టుకొని, వృత్తి రీత్యా పెయింటర్ అయిన మరో స్నేహితుడిని చివరి సారిగా కలసి, తన కష్టాన్ని చెప్పుకొని, చనిపోవాలని, అతనిని వెతుక్కుంటూ వెళ్లిన రజనికాంత్ కి అతను ఒక టెంపుల్ దగ్గర పెయింటింగ్ చేస్తూ కనిపించాడు. రజనీని చూసిన అతను, ఇప్పుడే పెయింటింగ్ మొదలుపెట్టాను వస్తున్నాను కూర్చోమని చెప్పాడట, అక్కడే కూర్చుని అతను వేస్తున్న పెయింటింగ్ ని గమనిస్తున్న రజనీకాంత్ కళ్ళ ముందు దేదీప్యమానంగా వెలిగిపోతున్న రాఘవేంద్ర స్వామి రూపం కనిపించిందట, ఆ స్వామి ముఖంలోని వర్చస్సు, ఆ స్వామి కళ్ళలోని కరుణ చూడగానే ఎక్కడలేని ధైర్యం వచ్చిందట, జీవితం మీద ఆశ చిగురించింది. ఆ స్నేహితుడితో కాసేపు మాట్లాడి, అక్కడ నుంచి తిరిగి మద్రాస్ చేరుకున్న రజనీకాంత్, పట్టు వదలక ప్రయత్నించి నటుడిగా అవకాశాలు దక్కించుకున్నాడు, తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తిరుగులేని స్టార్ గ ఎదిగారు. ప్రతి ఒక్కరి జీవితంలోను ఎప్పుడో ఒకప్పుడు ఆవహించే నిరాశ, నిస్పృహలను అధిగమించిన వాడే, అజేయుడవుతాడు అనడానికి సూపర్ స్టార్ రజని జీవితం ఒక ఉదాహరణ..!!