జెర్సీ’ తో గౌతమ్ తిన్ననూరి సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ‘జెర్సీ’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం కూడా అందుకున్నారు. ఆ సినిమాను యువి క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది కూడా! అయితే..ఈ మధ్య ఆ చిత్రాన్ని పక్కన పెట్టేశారు అనుకోండి! కారణాలు ఏవైనా… రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి సినిమా ఆగింది. ఇప్పుడు కొత్త సినిమాపై దర్శకుడు దృష్టి పెట్టారు. రామ్ చరణ్ సినిమా ఆగిన తర్వాత ఆయన దగ్గర నుంచి విజయ్ దేవరకొండ దగ్గరకు గౌతమ్ తిన్ననూరి వచ్చారని టాలీవుడ్ టాక్. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు మాంచి ఎంటర్‌టైనర్ ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుగు చిత్రసీమ వర్గాల కథనం.
ఆల్రెడీ విజయ్ దేవరకొండకు గౌతమ్ తిన్ననూరి కథ చెప్పడం, దానికి హీరోతో పాటు నిర్మాత నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగాయట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిసింది. ‘జెర్సీ’ని గౌతమ్ తిన్ననూరి హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్, ‘సీతా రామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ అక్కడ జంటగా నటించారు. ఆ సినిమా నిర్మాతలలో ‘దిల్’ రాజు ఒకరు. తెలుగులో వచ్చినంత పేరు హిందీలో రాలేదు. వసూళ్లు కూడా అంతంత మాత్రమే వచ్చాయి. అయినప్పటికీ… గౌతమ్ ప్రతిభపై ‘దిల్’ రాజు నమ్మకం ఉంచారు. విజయ్ దేవరకొండతో ఆయన సినిమా చేయనున్నారని కొన్ని రోజుల నుంచి వినబడుతోంది..!!