రెండు సంవత్సరాల క్రితం ఎవరో తన ఫోటోను అసభ్య రీతిలో మార్పింగ్ చేసినట్లు ఉర్ఫీ జావేద్ తెలిపింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొంది. ఆ ఫోటో వల్ల తాను మానసికంగా కుంగిపోయానని, నరకం అనుభవించానని ఉర్ఫీ వాపోయింది. అదే సమయంలో ఓ వ్యక్తి తనకు ఆ ఫోటోను పంపి వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టినట్లు చెప్పింది. ఆ ఫోటోకు సంబంధించిన రియల్ పిక్‌ను సోషల్ మీడియాలో పెట్టానని తెలిపింది. కొందరు వ్యక్తులు కావాలనే దాన్ని మార్పింగ్ చేసినట్లు చెప్పింది. ఈ ఫోటోను బేస్ చేసుకుని ఓ అజ్ఞాత వ్యక్తి తనను వేదించడం ప్రారంభించాడని చెప్పింది. ఆ ఫోటోను చూపిస్తూ.. తనను వీడియో సెక్స్ చేయాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు వెల్లడించింది…
లేదంటే ఆ ఫోటోను బాలీవుడ్ పేజీల్లో పోస్ట్ చేసి కెరీర్ ను నాశనం చేస్తానని బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. రోజు రోజుకు ఆ వ్యక్తి నుంచి లైంగిక వేధింపులు తీవ్రం అవడంతో ముంబై పోలీసులను ఆశ్రయించినట్లు ఉర్ఫీ వెల్లడించింది. ఈ నెల 1వ తేదీన ముంబైలోని గోరేగావ్ పోలీస్ స్టేషన్ లో సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. పోలీసుల తీరు కూడా చాలా దారుణంగా ఉందని వెల్లడించింది. ఎఫ్ఐఆర్ నమోదై 15 రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పింది. ముంబై పోలీసుల పనితీరు గురించి తాను చాలా గొప్పగా విన్నానని.. ఈ వ్యక్తి పట్ల వారి వైఖరి చాలా విచిత్రంగా ఉందని వెల్లడించింది.