పూజ హెగ్డేకి ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. అప్పటివరకూ ఆమె వెనకున్న అదృష్టం అదృశ్యమైనట్టు వరుస ఫ్లాపులు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘రాధేశ్యామ్’ .. సంచలన విజయాన్ని నమోదు చేస్తుందన్న ‘బీస్ట్’ .. మెగా ఫ్యాన్స్ కి పండుగ చేస్తుందనుకున్న ‘ఆచార్య’ ఫలితాలు నిరాశ పరిచాయి. ఈ సినిమాల పరాజయంలో పూజ పాత్ర లేకపోయినా, ఆమె కెరియర్ పై ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తాయి.
అయితే ఇదే సమయంలో ఆమెకి కాస్త ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే చేతిలో త్రివిక్రమ్ – మహేశ్ మూవీ ఉండటం. ఇక తాజాగా ఆమె విజయ్ దేవరకొండ జోడీగా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి ‘జన గణ మన’ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన పూజ హెగ్డేను సంప్రదించినట్టుగా సమాచారం. ఆల్రెడీ ఆమె ఓకే అనేసిందని కూడా అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాదైనా పూజకి కలిసిస్తుందేమో చూడాలి.