కన్నడిగుల ఆగ్రహం వెనుక ఓ బలమైన కారణమే ఉంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కర్ణాటక రాష్ట్రమంతా ప్రారంభమయ్యాయి. అయితే ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ వెర్షన్ల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మా రాష్ట్రంలో మా భాషలో కాకుండా ఇతర భాషల్లో ఉన్న ఆర్‌ఆర్‌ఆర్ టికెట్లు అమ్మడమేంటి? ఇది కన్నడిగులను అవమానించడమే అవుతుందని కొందరు సోషల్ మీడియాలో ఈ #BoycottRRRinKarnataka ప్రచారాన్ని నడిపిస్తున్నారు. ఆన్‌లైన్‌లో హిందీ, తెలుగు, తమిళ వెర్షన్ల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్న స్క్రీన్‌షాట్లను కూడా ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి వందల మంది సోషల్ మీడియా యూజర్లు కర్ణాటకలో ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు.
కన్నడలో లేనప్పుడు సినిమాను కర్ణాటకలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటూ కొందరు ట్విటర్‌లో ప్రశ్నించారు. రాధేశ్యామ్, పుష్ప సినిమా వాళ్లు కూడా ఇలాగే చేశారని, ఇక ఏమాత్రం సహించేదిలేదని మరికొందరు ట్వీట్లు చేశారు. కన్నడలో రిలీజ్ చేయనప్పుడు తమ రాష్ట్రంలో ఎందుకు ఈవెంట్ నిర్వహించారంటూ రాజమౌళిని నిలదీశారు. అయితే మరికొందరు యూజర్లు మాత్రం వాళ్లను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. హీరోలిద్దరూ స్వయంగా కన్నడలోనూ డబ్బింగ్ చెప్పారని, కన్నడలో రిలీజ్ చేయకపోతే రాజమౌళి ఎందుకు వాళ్లతో డబ్బింగ్ చెప్పిస్తాడని వాళ్లు వాదిస్తున్నారు. కన్నడలోనూ సినిమా రిలీజ్ అవుతుందని వాళ్లు చెబుతున్నారు.