సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రాలను తెరకెక్కించడంలో మేటి అనిపించుకున్నారు దర్శకులు, సంగీత దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయన రూపొందించిన చిత్రాలు, వాటిలో స్వయంగా స్వరకల్పన చేసిన గీతాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. ఏది చేసినా, జనానికి వినోదం పంచాలన్నదే కృష్ణారెడ్డి లక్ష్యంగా సాగారు. మళయాళంలో అలరించిన ‘సల్లాపం’ చిత్రం ఆధారంగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘ ఎగిరే పావురమా’ చిత్రం వెలుగు చూసింది. శ్రీస్రవంతి మూవీస్, చంద్రకిరణ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పి.ఉషారాణి నిర్మాతగా వ్యవహరించారు. జె.డి.చక్రవర్తి, శ్రీకాంత్, లైలా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఎగిరే పావురమా చిత్రం 1997 జనవరి 30న విడుదలయింది.
విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులోని ‘ఎగిరే పావురమా..’, ‘మాఘమాసం ఎప్పుడొస్తుందో…’, ‘రూనా లైలా…’, ‘దిసీజ్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్…’, ‘గుండె గూటికి పండగొచ్చింది…’, ‘ఆహా..ఏమి రుచి..అనరా మైమరచి..’ పాటలు విశేషంగా అలరించాయి. ఎస్వీ కృష్ణారెడ్డి స్వరవిన్యాసాలు సైతం జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన లైలా అతి త్వరలోనే అగ్రకథానాయకుల సరసన నటించే అవకాశం దక్కించుకుంది.అంతకు ముందు జె.డి.చక్రవర్తి, శ్రీకాంత్ కలసి నటించిన వన్ బై టూ కన్నా మిన్నగా ఈ సినిమా విజయం సాధించింది. కృష్ణారెడ్డి తెరకెక్కించిన విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా ఎగిరే పావురమా నిలచింది.