ఇది వరకు స్టువర్టు పురం పోలీస్ స్టేషన్ అనే సినిమా వచ్చింది. అందులో చిరంజీవి హీరో. ఇప్పుడు ఓ స్టువర్టు పురం దొంగని హీరోగా చేస్తూ సినిమా రూపుదిద్దుకోబోతోంది. అందులో రవితేజ హీరోగా నటించే అవకాశాలున్నాయని టాక్. స్టువర్టు పురం అనేది దొంగలకు ప్రసిద్ధి. అక్కడ ప్రతీ ఇంట్లోనూ ఓ దొంగ ఉండేవాడు. ఇప్పుడు ఆపరిస్థితులు లేవనుకోండి. అయితే స్టువర్టు పురం దొంగల్లో టైగర్ నాగేశ్వరరావు బాగా ఫేమస్. తను చెప్పి మరీ దొంగతనాలు చేశాడట. అప్పట్లో తను మోస్ట్ వాంటెడ్ దొంగ.
ఇప్పుడు తన కథనే.. `టైగర్ నాగేశ్వరరావు` గా తీయబోతున్నారు. అభిషేక్ నామా నిర్మాత. ఈ కథ చాలామంది హీరోల చుట్టూ తిరిగింది. రానా, బెల్లంకొండ శ్రీనివాస్… ఈ కథ విన్నారు. అయితే ఇప్పుడు రవితేజ చేతుల్లోకి స్క్రిప్టు వెళ్లిందని సమాచారం. రవితేజకు ఈ కథ బాగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దర్శకుడెవరు? ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అనే వివరాలు తెలియాల్సివుంది. ప్రస్తుతం `రామారావు`, `ఖిలాడీ` సినిమాలతో బిజీగా ఉన్నాడు రవితేజ. అవి అవ్వగానే.. టైగర్ నాగేశ్వరరావు మొదలవ్వొచ్చు.