అమెరికాలో జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ విషాదాంతం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తోంది. ఎక్కడ చూసినా వర్ణవివక్ష వ్యతిరేక భావనలు ఉప్పొంగుతున్నాయి. అయితే, వర్ణ వివక్షను వ్యతిరేకిస్తూ, నల్లజాతీయులకు మద్దతు పలికేవాళ్లందరూ సోషల్ మీడియాలో ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ (నల్లవాళ్లూ మనుషులే) అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగిస్తున్నారు. వీళ్లను వ్యతిరేకించే మరో వర్గం ‘ఆల్ లైవ్స్ మ్యాటర్’ (వాళ్లవే కాదు అందరివీ ప్రాణాలే) అంటూ మరో హ్యాష్ ట్యాగ్ ను ప్రచారం చేస్తోంది.
అయితే ఇందులో ‘ఆల్ లైవ్స్ మ్యాటర్’ అనే హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగిస్తూ టాలీవుడ్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఓ పోస్టు చేసింది. దీనిపై తన తప్పు తెలుసుకున్న శివాత్మిక వెంటనే స్పందించి క్షమాపణలు కోరింది. ‘ఆల్ లైవ్స్ మ్యాటర్’ అనే హ్యాష్ ట్యాగ్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమాన్ని వ్యతిరేకంగా వాడుతున్నారని, అయితే ఆ హ్యాష్ ట్యాగ్ ను తాను వాడడం పట్ల క్షమాపణలు తెలియజేస్తున్నానని, అది ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని శివాత్మిక వివరణ ఇచ్చింది.