కథలో పట్టు లేకపోతే, ఎంతటి సూపర్ స్టార్ నటించిన చిత్రమైనా ప్రేక్షకాదరణకు నోచుకోదు. మహానటుడు నటరత్న యన్.టి.రామారావు నటించిన చిత్రాలలోనూ అలాంటి సినిమాలు లేకపోలేదు. పైగా ‘రాముడు’ అన్న టైటిల్ తో రూపొందిన చిత్రాలలో యన్టీఆర్ సినిమాలు జనాన్ని నిరాశ పరచిన సందర్భాలు తక్కువే! అలాంటి చిత్రాల కోవకు చెందిన సినిమానే ‘కలియుగ రాముడు’. కె.బాపయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1982 మార్చి 13న విడుదలయింది. యన్టీఆర్ సరసన రతి అగ్నిహోత్రి నాయికగా నటించిన మూడో చిత్రమిది. అంతకు ముందు ‘ప్రేమసింహాసనం, తిరుగులేని మనిషి’ చిత్రాలలో యన్టీఆర్ తో జోడీ కట్టింది.
ఇందులో కవిత, ఎస్.వరలక్ష్మి, జయమాలిని, జయవిజయ, నిర్మలమ్మ, సత్యనారాయణ, జగ్గయ్య, కాంతారావు, ముక్కామల, మిక్కిలినేని, ప్రభాకర్ రెడ్డి, పి.జె.శర్మ, చలపతిరావు, ఆనంద్ మోహన్, భీమరాజు, విజయరంగరాజా నటించారు. ఇందులోని “నదులకు మొగుడు సముద్రమంట..”, “ఆనందో బ్రహ్మ..”, “హల్లా గుల్లా..” వంటి పాటలు అలరించాయి. ‘కలియుగ రాముడు’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఈ చిత్రం విడుదలైన 16 రోజులకే అంటే 1982 మార్చి 29న యన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీని ప్రకటించారు. ఆ తరువాత వరుసగా వచ్చిన ‘జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి’ అనూహ్య విజయాలను సొంతం చేసుకోవడం విశేషం..!!