ఎవరైనా ఇద్దరు ఓ విషయంలో వాదించుకుంటూ, పక్కనే ఉన్నవారిని “మీరైనా చెప్పండి..” అని అడిగితే, అందులో తలదూర్చడం ఇష్టం లేనివారు- “ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి..” అనడం సహజం. అవే మాటలను బ్రహ్మానందం నోట పలికించి, ఆ మాటలకు విశేషమైన ప్రాచుర్యం కలిగించిన చిత్రం ‘ఢీ’. ఈ సినిమా చూసినవారెవరైనా అందులో చారి పాత్రధారి బ్రహ్మానందం పలు మార్లు ఈ పదాలు పలికి, చేసిన కామెడీని మరచిపోలేరు. ఇప్పటికీ కొందరు సమయోచితంగా “ఇందులో మమ్మల్ని ఇన్ వాల్వ్ చేయకండి..” అంటూ సాగుతున్నారు.
అలా అలరించిన ‘ఢీ’ సినిమా హీరో మంచు విష్ణు కెరీర్ లో ఫస్ట్ హిట్ అని చెప్పాలి. దర్శకుడు శ్రీను వైట్లకు కూడా ఈ సినిమా ఓ టర్నింగ్ అనాలి. 2007 ఏప్రిల్ 13న విడుదలైన ‘ఢీ’ అలా మరికొందరికీ మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. శతదినోత్సవం చేసుకుంది. ఈ చిత్రం ద్వారా బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా శ్రీను వైట్లకు, బెస్ట్ ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ కు నంది అవార్డులు లభించాయి. ఈ చిత్రానికి ‘ఢీ అండ్ ఢీ: డబుల్ డోస్’ అనే పేరుతో మంచు విష్ణు హీరోగానే సీక్వెల్ తీస్తున్నట్టు 2020లో శ్రీను వైట్ల ప్రకటించారు. మరి అదెప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి..!!